Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నష్టాన్ని పూరిద్దాం... లక్ష్యాలను సాధిద్దాం: ఆసక్తికరంగా నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ!

సమస్యల్లో చిక్కుకున్న ఏపీని పునర్మించుకుందామంటూ మరికాసేపట్లో ఏపీ ప్రజలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం ప్రారంభం కానున్న నవనిర్మాణ దీక్షల్లో భాగంగా రాష్ట్ర ప్రజల చేత చంద్రబాబు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిజ్ఞకు సంబంధించిన సందేశం సిద్ధమైపోయింది. అవినీతిపై పోరుతో మొదలయ్యే ఈ ప్రతిజ్ఞ లక్ష్యాలను సాధిద్దామన్న పిలుపుతో ముగియనుంది. ఈ ప్రతిజ్ఞ కింది విధంగా సాగుతుంది. ‘‘అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్నీ ఓ అవకాశంగా మలచుకుందాం. దేశ భక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం భుజంభుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికి ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం’’ అంటూ జనంతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించనున్నారు.

More Telugu News